బూర్గంపహాడ్, జూలై 18 : నూతన సాంకేతికతను రైతులు విస్తృతంగా వినియోగించుకోవాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సోంపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రోత్సాహం, వ్యవసాయ శాఖ సహకారంతో వానాకాలం సాగులో విత్తనాలు వెదజల్లే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు అదనపు ఆదాయం అందించే పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. పామాయిల్, మునగ, కొర్రమీను, బాతుల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ రంగాలతో రైతులు ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఏడీఏ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ శంకర్, ఆదర్శ రైతు గాదె నర్సింహారెడ్డి, రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.