దమ్మపేట, జూన్ 30 : రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, యూరియా యాప్ ను రద్దు చేయాలని, కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దమ్మపేట తాసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐయూకేఎస్ శ్రేణులు మంగళవారం నిరసన తెలిపి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దార్కు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకురాలు తోడం దుర్గమ్మ, అఖిల భారత ఐక్య రైతు సంఘం డివిజన్ అధ్యక్షుడు పండూరి వీరబాబు మాట్లాడుతూ.. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు లభించడం లేదన్నారు. అరకొరగా కురిసిన వర్షానికి విత్తిన విత్తనాలు మొలవక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
రైతులు యూరియా యాప్ ద్వారా యూరియా, డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు సకాలంలో అందడం లేదన్నారు. ఒకే దఫాలో రైతు భరోసా చెల్లించాలని, గత బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ధాన్యం అమ్మిన రైతాంగానికి బిల్లులు, బోనస్ తక్షణమే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కురసం ముత్యాలరావు, అఖిల భారత ఐక్య రైతు సంఘం మండల అధ్యక్షుడు కుంజా కాంతారావు, మండల నాయకులు పూజల సంజీవరావు, భద్రం, సున్నం జగన్, శీలం రాంబాబు, గంగాధర నాగమణి, కుప్పాల నాగరాజు, రాజేశ్వరి పాల్గొన్నారు.