రుద్రంపూర్, ఏప్రిల్ 08 : కాంట్రాక్టర్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశ పెడుతున్న కన్వెన్స్ వాహనాలలో పాత డ్రైవర్లను కొనసాగించాలని కోరుతూ వి.కే.సీఎం ఫిట్ సెక్రటరీ ఈ.శంకర్ నాయకత్వంలో వి.కే.సీఎం మేనేజర్ మురళికి ఆయన కార్యాలయంలో బుధవారం మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ భాషబోయిన రవికుమార్ మాట్లాడుతూ.. గతంలో కూడా కన్వెన్స్ డ్రైవర్ల సమస్యపై మెమోరాండం అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుమారు 20 సంవత్సరాలుగా జీకేఓసీ, వీకేఓసీ ప్రాంతాల్లో పని చేస్తున్న డ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నారని, వారి ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
అలాగే సింగరేణిలో పని చేస్తున్న కన్వెన్స్ డ్రైవర్ల ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షుడు దివంగత రాసూరి శంకర్ ఆధ్వర్యంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని వివరించారు. ఆ కేసులో భాగంగా సింగరేణి యాజమాన్యం కోర్టుకు సమర్పించిన లేఖలో పాత డ్రైవర్లను కొనసాగిస్తామని, ల్యాండ్ లూజర్ (భూ నిర్వాసితులు) ఓనర్‌కు ఒక పోస్టు ఇచ్చి, మిగతా రెండు పోస్టులను పాత డ్రైవర్లకే కేటాయించాలని తెలిపిన విషయాన్ని మేనేజర్ దృష్టికి తీసుకు వచ్చామన్నారు. ఈ విషయంపై స్పందించిన మేనేజర్ సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత ఓనర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి, ఇద్దరు పాత డ్రైవర్లను కొనసాగించి ఒకరిని కొత్తగా నియమించుకోవాలని సూచిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆఫ్ లోడింగ్ ఇన్చార్జ్ తోకల రామచందర్‌తో పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు.