నాగర్ కర్నూల్ : రైతులను మోసం చేసిన దళారులను స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan ) ఆరోపించారు. నాగర్ కర్నూల్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ. 150 విలువ చేసే డీఏపీని రూ.1,600 పైగా విక్రయించి మిగతా డబ్బు ఎవరి జేబులోకి పోతుందని ప్రశ్నించారు. మొక్కజొన్న కొనుగోళ్లు,గన్ని బ్యాగులు, ట్రాన్స్ పోర్ట్ చార్జీల్లో రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
నకిలీ డీఏపీ ( Fake DAP) , ఎరువుల కృత్రిమ కొరతకు అసలు బాధ్యులు ఎవరని సూటిగా ప్రశ్నించారు. నకిలీ డీఏపీ సూత్రదారులపై పీడీ యాక్ట్ ( PD Act ) నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న మోసగాళ్లు అధికార పార్టీ నాయకులకు కనపించడం లేదా అంటూ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేకు వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేదని, రైతుల సమస్యలపై సమీక్ష నిర్వహించే తీరిక కూడా లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు రాజ్యం నడిస్తే, కాంగ్రెస్ పాలనలో రాక్షస రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు , ఎమ్మెల్యే అండదండలతో గన్నీ బ్యాగులను బ్లాక్‌లో విక్రయిస్తూ ఒక్కో బ్యాగుపై రూ.5 నుంచి రూ.15 వరకు అక్రమంగా వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ నీళ్లను కాపాడాల్సిన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌కు కాపలాదారుగా మారిందని ఎద్దేవా చేశారు.
సీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం మరో వారం రోజుల్లో శ్రీశైలానికి వరదలు చేరనున్నాయని, వరద వచ్చినా వెంటనే నార్లాపూర్‌తో పాటు కల్వకుర్తి లిఫ్ట్ పంపులను ప్రారంభించి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.