Anna Hazare : సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే (Anna Hazare).. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా గురువారం మహారాష్ట్ర (Maharastra) లోని అహల్యానగర్ (Ahilya Nagar) లో రెండు గంటలపాటు మౌన ఆందోళన్ చేపట్టారు. ఉదయం 11 గంటలకు అహల్యానగర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ఆయన నిరసన మొదలుపెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకు ముగించారు. ఆ తర్వాత అదే జిల్లాలోని తన గ్రామం రాలేగణ్ సిద్ధికి వెళ్లిపోయారు.
అంతకుముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అన్నా హజారే లేఖ రాశారు. విద్యార్థులపై హింస, పోలీసుల చర్యల వార్తలు తీవ్రంగా కలచివేస్తున్నాయని అందులో పేర్కొన్నారు. నిరసనకారుల ఆగ్రహాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా సమాజం అనుభవిస్తున్న వేదన ఆశల ప్రతిబింబంగా చూడాలని లేఖలో తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తే ప్రభుత్వం కూలిపోదని, దాంతో ప్రభుత్వ పనితీరు మరింత జవాబుదారీతనంతో, సమర్థంగా మారుతుందని ఆయన చెప్పారు.
నిరసనకారుల మాటలను ఓర్పుగా వినాలని, నమ్మకం పెంచే వాతావరణం కల్పించాలని, సానుకూల చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మౌన ఆందోళన్ తర్వాత విలేకరులతో మాట్లాడిన హజారే.. ప్రజల సమస్యలు ప్రధానమంత్రికి తెలియాలని, అందుకే ఆయనకు లేఖ రాశానని చెప్పారు. మరోవైపు గురువారం జంతర్ మంతర్ పరిసరాల్లో భారీభద్రత ఏర్పాటు చేశారు. క్లిష్ట పరిస్థితుల కారణంగా సాయంత్రం 6.30 గంటలకల్లా కన్నాట్ ప్లేస్‌లోని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించారు.