కొత్తగూడెం ప్రగతి మైదాన్, 28 ఏప్రిల్ : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. గత వారం రోజులుగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నడిపల్లి-గల్గామ్ గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో కాసేపటి క్రితం మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు.
అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. సుమారు 30 నిమిషాలుగా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటన స్థలానికి అదనపు భద్రతా దళాలు చేరుకుంటున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రాణ నష్టం తెలియాల్సి ఉంది. భద్రతా బలగాలు వారం రోజులుగా కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. సోమవారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఈ ఎదురు కాల్పుల వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
ఆపరేషన్ కగార్ ను ఆపాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్నటి వరంగల్ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో యువకులను, గిరిజనులను ఊచకోత కోయడం ధర్మం కాదన్నారు. శాంతి చర్చలకు నక్సలైట్లు ప్రతిపాదన పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. ప్రభుత్వంతో చర్చలు చేయడానికి నక్సలైట్లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారన్నారు. ఈ నేపథ్యంలో తాను కేంద్రాన్ని ఒకటే కోరుతున్నట్లు.. బలం ఉందికదా అని చంపుకుంట పోవడం సరికాదని, అది ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేయాలన్నారు. నక్సలైట్లను పిలిచి చర్చలు జరపాలని కోరారు. వాళ్ల ప్రతిపాదన ఏంటో దేశం ముందటికి రానీయాలన్నారు. అట్లకాకుండా మొత్తం నరికేస్తాం, కోసి పారేస్తం అంటే ఎలా? అని ప్రశ్నించారు. మిలట్రీ మీ దగ్గర ఉన్నది కాబట్టి కొడతరు. కానీ అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది ధర్మం కాదు అని కేసీఆర్ అన్నారు.