ఇల్లెందు, మే 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేపులపల్లి మండలం బేతంపూడి గ్రామ పంచాయతీలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు పంటలపై అవగాహన కార్యక్రమం మండల వ్యవసాయ శాఖ అధికారి అన్నపూర్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ నవీన్ కుమార్, శ్రీనివాసరావు, ఇల్లెందు ఏడీఏ లాల్చందు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రైతులు లోతు దుక్కులు దున్నడం వల్ల కీటకాలు నశిస్తాయని తెలిపారు. పంటలు వేశాక అధిక యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి రైతులకు ఎక్కువ ఖర్చు వస్తుందని, యూరియా వాడకం తగ్గించాలన్నారు.
అలాగే తొలకరిలో పచ్చిరొట్టె సాగు చేసి కలియ దున్నడం వల్ల పంటలో కార్బన్ శాతం పెరిగి భూమి ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, మొక్కజొన్న బదులు అపరాల పంటలైన పెసర, మినుము, కంది సాగుతో భూసారం పెరుగుతుందన్నారు. ఆయిల్‌పామ్, మునగ, వెదురు సాగు వల్ల రైతులు మంచి లాభాలు సాధించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ అన్నపూర్ణ, ఏఈఓలు శ్రావణి, ప్రవీణ్, రమేశ్, భాగ్యశ్రీ, రైతులు పాల్గొన్నారు.