రామవరం, జనవరి 20 : వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా తమ గ్యమస్థానాలకు చేరుకోవాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమం అరైవ్-అలైవ్ -2026 కార్యక్రమంలో భాగంగా జీఎం ఆఫీస్ ప్రక్కన టూ టౌన్ సిఐ ప్రతాప్ ఆధ్వర్యంలో లారీ అసోసియేషన్ వారితో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు.
రోడ్డుపై విధుల్లో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా, లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ, నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు,ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని డీఎస్పీ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. ఈ సందర్భంగా డ్రైవర్ల అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రతాప్, ఎస్ఐలు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్వేత, మానస, పోలీస్ సిబ్బంది, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, పలవురు లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.