– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్
జూలూరుపాడు, మే 22 : పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని, ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పర్యావరణ పరిరక్షణ వారధులుగా మారి ప్రజల్లో అవగాహన పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైన్స్ అధికారి (DSO) బి.సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ‘99 రోజుల పర్యావరణ అవగాహన కార్యక్రమం’నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాపకొల్లు నందు ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరంలో శుక్రవారం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
భూమిని, ప్రకృతిని కాపాడుకోవడానికి పర్యావరణ స్పృహ ఎంతో అవసరమని, రాబోయే తరాల భవిష్యత్ నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించడానికి అద్భుతమైన వేదికలని, కాబట్టి విద్యార్థులు అత్యధిక సంఖ్యలో వీటిలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి బి.జుమ్కీ లాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.కె.మీరా సాహెబ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.