బూర్గంపహాడ్, జూన్ 14 : ఏజెన్సీలోని మారుమూలన ఉన్న ప్రతి గిరిజన పల్లెకు వైద్య సేవలు అందాలని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ ప్రాథమిక వైద్యశాలను డీఎంహెచ్ఓ ఎల్.భాస్కర్నాయక్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి ఓపీ రిజిస్టర్ను తనిఖీ చేశారు. ల్యాబ్, మందుల గది, ప్రసవాల గది, ఓపి గది, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు 24 గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలని, ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు.
ఆశావర్కర్ నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు అందరూ సమన్వయంతో పనిచేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, గర్భిణులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యాలపై నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు జయలక్ష్మి, పి.చైతన్య, ప్రొగ్రాం ఆఫీసర్ ప్రసాద్ లక్ష్మీసాహితీ, పుల్లారెడ్డి పాల్గొన్నారు.