రుద్రంపూర్, మే 25 : తీవ్ర ఎండల ప్రభావంతో వడదెబ్బ తగిలి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని తిలక్‌నగర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవులపల్లి లక్ష్మి(80) రుద్రంపూర్‌కు చెందిన నివాసి. ఆదివారం సాయంత్రం ఆమెకు ఒక్కసారిగా జ్వరం రావడంతో పాటు వాంతులు, విరోచనాలు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో పంచాయతీ పరిధిలో వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో పంచాయతీలో పనిచేసే పారిశుధ్య కార్మికుడు ఎన్.రజనీకాంత్ కూడా వడదెబ్బ కారణంగా ఇటీవల మృతి చెందడం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని, తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.