బూర్గంపహాడ్, మే 04 : కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడి కార్మికులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఎండను సైతం లెక్కచేయకుండా గత 40 రోజులుగా కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించి కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జేఏసీని ఉద్దేశించి మాట్లాడుతూ వేతన ఒప్పందం జాప్యం లేకుండా చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, 100 శాతం మెడికల్ ఇవ్వాలని, వేతనం రూ.22 వేలకు తగ్గకుండా అగ్రిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.
స్వయంగా ఐటీసీ యాజమాన్యాన్ని కలిసి కార్మిక సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని జేఏసీకి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్‌పాషా, ఆకిని సర్వేశ్వరరావు, బల్లెం నాగయ్య, మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఇంగువ రమేష్, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.