– ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె.చాంద్ పాషా
జూలూరుపాడు, జూలై 23 : నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె.చాంద్ పాషా డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం తదనంతర పరిణామాలకు నిరసనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఈ నెల 24న తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై దేశవ్యాప్తంగా 21 మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమన్నారు. ఈ బలిదానాలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కేంద్రం వైఫల్యం వల్లే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు వరుసగా లీక్ అవుతున్నాయని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు.కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వైపు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్న యువతపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడం, బాష్పవాయువు, వాటర్ క్యాన్లు ప్రయోగించి గాయపరచడం దుర్మార్గమన్నారు. విద్యార్థులపై దాడులకు పాల్పడిన పోలీసు అధికారులపై సమగ్ర విచారణ జరిపి, వెంటనే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ఈ నెల 24న జరిగే విద్యాసంస్థల బంద్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.