వేములవాడ, జూన్ 10 : సమాజ సేవలో యువత ముందుండాలని వేములవాడ డీఎస్పీ పి శ్రీనివాసులు అన్నారు. బుధవారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువతతో కలిసి వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుపదార్థాలకు అలవాటు పడకుండా సమాజ సేవలో ముందుండి సేవ చేస్తే తగిన గుర్తింపు వస్తుందని సూచించారు.
ఈరోజు నాటే ప్రతి మొక్క రేపటి వృక్షంగా మారి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు తోడ్పడుతుందని చెప్పారు. ఇప్పటికే భారీగా వాతావరణ సమతుల్యం ఏర్పడిందని ప్రతి ఒక్కరు బాధ్యతతో మొక్కలు నాటి వాటి పరిరక్షణ కూడా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, అటవీశాఖ అధికారులు మొహమ్మద్ జలీల్, ప్రసాద్, యువకులు పాల్గొన్నారు.