ఇల్లందు, మార్చి 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ఎస్ఐ సందీప్‌కుమార్ ఇటీవల టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-1 ఫలితాల్లో 502 మార్కులు సాధించి మెరుగైన ర్యాంక్ సాధించాడు. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇల్లందు డీఎస్పీ ఎన్.చంద్రభాను, ఇల్లందు ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ ఎస్ఐ సందీప్ కుమార్‌ను మంగళవారం సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఎస్ఐ సందీప్ కుమార్ నిరూపించారన్నారు.
పోలీస్ ఉద్యోగం చేస్తూ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి గ్రూప్ -1లో అత్యధిక మార్కులు సాధించడం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు. యువత చెడు వ్యసనాలకు గురికాకుండా, సెల్ఫోన్లకు, ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడకుండా ఎస్ఐ సందీప్ కుమార్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యువత మంచి ప్రవర్తనతో ఉండి ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగపరుచుకుని భవిష్యత్‌లో మంచి స్థాయికి ఎదగాలని డీఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.