కొత్తగూడెం అర్బన్ ఏప్రిల్ 29 : ఇండ్లు, భూములు, ప్లాట్లు, తనఖా రిజిస్ట్రేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన స్లాట్ బుకింగ్ విధానంతో అమ్మకం, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే దానిని రద్దు చేసి ఇతరత్రా పాత పద్ధతి నే కొనసాగించాలని డాక్యుమెంట్ రైటర్లు కొత్తగూడెం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు డాక్యుమెంట్ రైటర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. స్లాట్ బుకింగ్ విధానంలో స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఏదైనా సమస్యతో ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మరోసారి స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఇబ్బందులు తలెత్తున్నాయని, సర్వర్ డౌన్ అవుతుందని ఫలితంగా రిజిస్ట్రేషన్ ల సంఖ్య కూడా తగ్గుతుందన్నారు. దీంతో ప్రభుత్వం ఆదాయం కొల్పోవడంతో పాటు, డాక్యుమెంట్ రైటర్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రిజిస్ట్రేషన్ ఏరియాలుగా వున్న పాల్వంచ, పాత కొత్తగూడెం, సుజాత నగర్, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఇంటి అసెస్మెంట్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని, ఏజెన్సీ ఆధారిత పార్టిషన్ డీడ్లను నమోదు చేసుకోవడానికి అనుమతిని ఇవ్వాలని కోరారు. మున్సిపాలిటీ , గ్రామ పంచాయతీ లలో కొంతమంది ఇంటి యజమానులు 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నప్పటికీ అవగాహన రాహిత్యంతో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పట్టా భూములలోనే ఇండ్లు నిర్మించుకొని ఇంటి నెంబర్,అసెస్మెంట్ లు తీసుకొని నివాసం వుంటున్నారు.
ఈ తరహా స్థలాలు, నివాస గృహాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా ఆస్తికి సంబంధించి సరైన చట్టబద్ధత ఏర్పడుతుందని, భవిష్యత్తులో వారసత్వం, కొనుగోలు, అమ్మకం లాంటి వ్యవహారాలు నిరవధికంగా జరుగుతాయని తెలిపారు. అనంతరం వారు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు జావిద్, అన్వర్, శ్రీకాంత్ సుధాకర్ రాజు, దావూద్, అహ్మద్, చిన్ని, శ్రీను, జీవన్, సారథి తదితరులు పాల్గొన్నారు.