చుంచుపల్లి, జనవరి 12 : రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోవత్సవాల్లో భాగంగా సోమవారం చుంచుపల్లి బస్టాండ్ సెంటర్ నందు గల ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై డీటీఓ భూషిత్రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, అదేవిధంగా డ్రైవర్ పక్కన ఎవరిని కూర్చొబెట్టుకోవద్దని సూచించారు. స్కూల్‌కి విద్యార్థులను పరిమితికి మించి తీసుకువెళ్లకూడదని హెచ్చరించారు. ఆటోకి తప్పకుండా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని తెలిపారు. అతివేగం శ్రేయస్కరం కాదన్నారు. ప్రయాణికులను వారి గమ్యాలకు సురక్షితంగా చేర్చే బాధ్యత డ్రైవర్లపై ఉన్న కారణంగా ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంవీఐలు రాకేష్, అశోక్, శ్వేతా, మానస, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.