కొత్తగూడెం: ఉపకరణాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా వాహనాలు, బ్యాటరీ వీల్చైర్లు, ల్యాప్టాప్స్, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పీహెచ్డీ చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డికి, సాంబశివరావు, శ్రీనివాస్‌లకు ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ చేశారు.
బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలతో దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా వారంతట వారే స్వయంగా వెళ్లడానికి అవకాశం ఉందని, 0-18 సంవత్సరాలు వయస్సు ఉన్న ఆపదలో, పనుల్లో ఉన్న చిన్నారులను, బాల్య వివాహాలను అరికట్టేందుకు బాలరక్షక్ మొబైల్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా మార్చాలని అన్నారు. ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించేందుకు 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ రాగానే తక్షణమే మొబైల్ వాహనం చేరుకొని చిన్నారుల రక్షణ చర్యలు చేపడుతుందని అన్నారు.
ఆపదలో ఉన్న చిన్నారులను గుర్తించడం, వారిని రక్షించేందుకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ, జిల్లా సంక్షేమాధికారిణి వరలక్ష్మీ, బాలల సంరక్షణ అధికారి హరికుమారి, జిల్లా చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ రాజ్‌కుమార్, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు అంబేద్కర్, సాధిక్‌పాషా, టీవీపీఎస్ అధ్యక్షుడు గుండపనేని సతీష్‌లు పాల్గొన్నారు.