జూలూరుపాడు, మే 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జాతీయ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ క్షయ వ్యాధిగ్రస్తులకు గురువారం పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ కంపెనీల యాజమాన్యంతో మాట్లాడి క్షయ వ్యాధిగ్రస్తులందరికీ పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
జూలూరుపాడులోని ప్రభుత్వ ఆస్పత్రిలో క్షయ వ్యాధిగ్రస్తులకు 23 మందికి ఆరు నెలలకు సరిపడా పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా విశేష కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు ఏమి కావాలన్నా ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు లేళ్ల వెంకట్రెడ్డి, మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, మాజీ ఎంపీటీసీ మధు, వైద్యాధికారి వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.