కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 16 : ఎన్నికల సమయంలో ఇంటి పట్టాలు ఇస్తానని ఎమ్మెల్యే ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని, జీఓ నం.76 ద్వారా ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ జైభీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి యెర్రా కామేశ్ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం పట్టణంలో ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం జీఓ 76 ప్రవేశ పెట్టగా సుమారు 2 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. దరఖాస్తుతో పాటు డబ్బులు కూడా కట్టారని ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే పట్టాల పంపిణీ ప్రక్రియను నిలిపివేసినట్లు చెప్పారు.
ఎన్నికలు ముగిసి 16 నెలలు దాటినా నేటికీ పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభికపోవడం విచారకరమన్నారు. దీంతో ఇల్లులు కొనుగోలు, అమ్మకాలు జరగక ప్రజలు ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు, జిల్లా ఉపాధ్యక్షుడు మాలోత్ వీరూనాయక్, వంగా రవిశంకర్, నున్న శివచౌదరి, పూణెం మురళి పాల్గొన్నారు.