జూలూరుపాడు, జూన్ 17 : గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలను తక్షణమే అందజేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులతో కలిసి మంగళవారం జూలూరుపాడు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీఓ తులసీరామ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలను ఇవ్వకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాలు గొర్రె తోక బెత్తడు అన్న చందంగా ఉన్నాయని, వాటిని కూడా నెల నెలా సక్రమంగా ఇవ్వకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందన్నారు. అడ్డ మీద కూలీలకి ఇస్తున్న వేతనం కూడా పంచాయతీ కార్మికులకు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్మికుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగస్తులు మాదిరిగానే ఎకౌంట్లో జమ చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ నేటికి ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు. తక్షణమే కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాల్ని అందజేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే వారి అకౌంట్లో పంచాయతీలకు సంబంధం లేకుండా నెలనెలా వేతనాన్ని ఇవ్వాలన్నారు. అలాగే గ్రామ పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాడుగా ఉన్న 51 జీఓని సవరించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామపంచాయతీ కార్మికులను రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని, ఉద్యోగ భద్రత కల్పించి 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని కోరారు.
పీఎఫ్, ఈఎస్ఐ చట్టాల అమలు చేయాలని, కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రూ.26 వేలు ఇవ్వాలని, కారోబార్లను, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలన్నారు. పంచాయతీ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్ ని రూ.5 లక్షలు, ఇన్సూరెన్స్ రూ.10 లక్షలు చెల్లించాలని, అనారోగ్యానికి గురై చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు నాగు, ప్రధాన కార్యదర్శి ధనవంతురావు, గౌరవాధ్యక్షుడు తంబర్ల లక్ష్మి ఈరు, ఉపాధ్యక్షుడు శిరంశెట్టి వినోద్, సహాయ కార్యదర్శి ఈరియా, కోశాధికారి విజయ, రజిని, మురళి, రాంబాబు, సుజాత, సేవ్య పాల్గొన్నారు.