బూర్గంపహాడ్, ఆగస్టు 21 : బూర్గంపహాడ్ మండలం నకిరిపేట సమీపంలో అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల(అటవీ జంతువుల) కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోయిన సంగతి…ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు కూడా చేసి రిమాండ్కు పంపారు. ఈ ఘటన అటవీశాఖ అధికారులు, సిబ్బందిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. వన్యప్రాణుల వేట నివారణకు జిల్లా అటవీశాఖ అధికారి విక్రమ్ సింగ్ ఈ ఘటనపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఘటన వివరాలను సైతం తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించి ఇందులో భాగంగా జిల్లాలో అటవీ ప్రాంతాల్లో ఉన్న అక్రమ విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వన్యప్రాణుల వేట నియంత్రణలో సిబ్బందితో పాటు పరిసర ప్రాంత రైతులను భాగస్వాములను చేస్తున్నారు. అడవిలో అక్రమ విద్యుత్ తీగలు గుర్తించేందుకు అధునాతన పరికరాలతో పాటు నూతన టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించారు. బీట్ అధికారి నవీన్ విద్యుద్ఘాతంతో పడిపోయిన క్రమంలో అంబులెన్స్ వచ్చే వరకు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లలేకపోయిన సంఘటనను పరిగణనలోకి తీసుకుని మున్ముందు ఏ అటవీ అధికారికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని క్షేత్రస్థాయిలో అవసరమైన నాలుగు చక్రాల వాహనాల ఏర్పాటుపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
అటవీ ప్రాంతాల్లో కవర్డ్ కండక్టర్ (ఇన్సులేటెడ్ కోటింగ్) లైన్లు వేస్తే వేటగాళ్లు కొండీలు తగిలించేందుకు వీలు ఉండదు. దీంతో ఖచ్చితంగా విద్యుత్ ఉచ్చులతో వేట ఆగిపోతుంది. దీనికి అధికంగా వ్యయం అయ్యే అవకాశం ఉంది. వన్యప్రాణులతో పాటు అడవుల రక్షణకు పెద్దసంఖ్యలో కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా అనుమానాస్పద కదలికలు తెలుసుకునే వీలు కూడా ఉంటుంది. అడవుల పరిసర గ్రామాల్లో వన సంరక్షణ సమితులను ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న వాటిని బలోపేతం చేయాల్సి ఉంటుంది. వేట నిరోధానికి గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి గస్తీని ముమ్మరం చేస్తే అడవులతో పాటు వన్యప్రాణుల రక్షణకు బాటలు పడినట్లవుతాయి.