– చుంచుపల్లి పోలీసులపై విమర్శలు
చుంచుపల్లి, జూన్ 09 : చుంచుపల్లి మండలంలో చోటుచేసుకున్న భూ వివాద ఘటనలో స్థానిక పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు రక్షణ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఓ ఒంటరి మహిళ భూమిలో అక్రమంగా ప్రవేశించి ట్రాక్టర్‌తో దున్నుతున్న వ్యక్తులను పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తీసుకువచ్చిన అనంతరం ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దౌర్జన్యానికి ఉపయోగించిన స్వరాజ్ ట్రాక్టర్ (TG 28 T 5084)ను, అక్కడ ఉన్న వ్యక్తులను స్టేషన్‌కు తరలించారు. అయితే కొద్ది సేపటికే ట్రాక్టర్, సంబంధిత వ్యక్తులు స్టేషన్లో కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా ట్రాక్టర్‌ను నడిపిన డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ట్రాక్టర్‌ను సీజ్ చేయకపోవడం, తాళాలు కూడా స్వాధీనం చేసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
ఇదే భూమికి సంబంధించి బాధితురాలికి కోర్టు రక్షణ ఉత్తర్వులు ఉండటంతో పాటు పోలీస్ శాఖలో ఆన్లైన్ పిటిషన్ కూడా నమోదై ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, నిందితులను వదిలేయడంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
అదేవిధంగా ట్రాక్టర్‌ను ఎందుకు వదిలేశారనే విషయంపై వివరణ కోసం సంబంధిత పోలీసు అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ కాల్స్‌కు స్పందించలేదని సమాచారం. దీంతో ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు మరింత బలపడుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు విధి నిర్వహణలో బాధ్యతా రహితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.