– సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ చేసిన దొంగల పట్టివేత
– చోరీ సొత్తు రికవరీ
రామవరం, ఆగస్టు 11 : ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, దాని దృష్టిలో ఉంచుకుని కాలనీల్లో గ్రూపులుగా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు జరిగే అవకాశం ఉండదని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. సోమవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన రుద్రంపూర్ నాలా ఏరియాకు చెందిన సింగరేణి ఉద్యోగిని వాకపల్లి వెంకటరమణ ఇంట్లో జరిగిన చోరీని పోలీసులు చేధించినట్లు తెలిపారు. సోమవారం టూ టౌన్ పరిధిలోని 4 ఇంక్లైన్ ప్రభుత్వ ఐటీఐ వద్ద టు టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామవరం చెందిన నారసాని రమేశ్, కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మేదర బస్తి గొల్లగూడెం చెందిన ఓర్సు కుమార్, ఇరువురు మోటార్ సైకిల్‌పై అనుమానాస్పదంగా వస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని, సోదా చేయగా బంగారు వస్తువులు, నగదు కలిగి ఉండడంతో వారిని ప్రశ్నించడంతో ఈ నెల 4వ తేదీన రుద్రంపూర్ కు చెందిన రమణ ఇంటిలో దొంగతనం చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి 22 తులాల బంగారం, 268 గ్రాముల వెండి, రూ.2,78,000 నగదును రికవరీ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.