లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 24 : లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ- సాటివారిగూడెం బైపాస్ రోడ్డు మీదుగా పాల్వంచ వెళ్తున్న ప్రధాన రహదారి వెంట పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి రోడ్డుపైకి విస్తరించాయి. ఈ రహదారి గుండా బెటాలియన్ అధికారులతో పాటు, పాల్వంచ వైపునకు వెళ్లే ప్రజలు ఎంతోమంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ రహదారిలో అనేక రోడ్డు మూలమలుపులు ఉన్నాయి. ఇరువైపులా ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనబడని పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని స్థానిక ప్రజలతో పాటు వాహనదారులు కోరుతున్నారు.