పాల్వంచ, ఏప్రిల్ 24 : పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయాన్ని గురువారం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. ముందుగా పాల్వంచ పట్టణంలోని పలు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చి మాటలు తప్పా చేతలు శూన్యం అన్నారు. పేదలకు ఇంటి స్థలం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ రాలేదని తీవ్రంగా విమర్శించారు.
అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు పింఛన్లు పెంచాలని డిమాండ్ చేశారు. పాల్వంచ పట్టణంలో వివిధ కాలనీల్లో డ్రైనేజీ రోడ్లు, కరెంట్ పోల్స్ సమస్యను పరిష్కరించాలని, మిషన్ భగీరథ పైపులు పగిలిపోయి రోడ్లపై నీరు ప్రవహిస్తుందని, పరిష్కారానికి కమిషనర్ చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో ప్రజలను సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యవర్గ సభ్యురాలు జ్యోతి, జిల్లా కమిటీ సభ్యుడు దొడ్డ రవి, పట్టణ కార్యదర్శి పి.తులసీరామ్, కార్యవర్గ సభ్యులు కె.సత్య, వి.సత్యవాణి, టౌన్ కమిటీ సభ్యులు సులోచన, గౌస్య, మాధవి, వింజ రాములు పాల్గొన్నారు.