 
                                                            కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 31 : కోతులు, కుక్కల వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, వాటి దాడుల వల్ల మహిళలు, చిన్నారులు గాయాలపాలవుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు అన్నారు. శుక్రవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ డీఈ రవి కుమార్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. అనేకసార్లు కార్పొరేషన్ అధికారులను కలిసి విన్నవించినప్పటికి స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతులు, కుక్కలు పట్టుకోవడం కోసం కేటాయించిన నిధులను కూడా అధికారులు స్వాహా చేసి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం శోచనీయమన్నారు.
కిన్నెరసాని మంచి నీరు ప్రతి రోజు ప్రజలకు అందించాలని నీటి సమస్య తీవ్రంగా ఉందని అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల ప్రజలు అనేక పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన పైప్ లైన్ కోసం గుంతలు తవ్వి వదిలేయడం వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్య పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇంటింటి చెత్త ఎత్తేందుకు కూడా వాహనాలు సకాలంలో రాకపోవడం వల్ల వీధులన్నీ దుర్గంధం వెదజల్లి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అదే విధంగా బ్లీచింగ్, ఫాగింగ్ చేయాలని, గుంతలమయంగా మారిన రోడ్లకు మరమత్తులు వెంటనే చేయాలనీ, సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. అలాగే గతంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నివాసం ఉంటున్న బైండ్ల కుటుంబాలను రామవరం ప్రాంతానికి తరలించారని అక్కడ కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆ కుటుంబాల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నగేష్, భూక్యా రమేష్, ఎస్.లక్ష్మి, అలేటి శ్రీను, ఇందిరా, సూరం ఐలయ్య, శ్రీ రాములు, రమేష్ బాబు, నాగ కృష్ణ, బాల కృష్ణ, ముక్తేశ్, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
 
                            