– పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్
జూలూరుపాడు, మే 29 : కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా జూలూరుపాడు మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జూలూరుపాడు మండల కార్యదర్శి బానోతు ధర్మ మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 12 ఏళ్లుగా పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారాలు మోపుతోందని విమర్శించారు. పెట్రోలు, డీజీలు, గ్యాస్‌తో పాటు బస్సు, రైల్వే, విమాన ఛార్జీలను సైతం విపరీతంగా పెంచేసిందని మండిపడ్డారు.
నిత్యం వాడే కిరాణా సరుకులు, మందులు, చివరకు వ్యవసాయానికి అవసరమయ్యే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ధరలను కూడా పెంచి సామాన్యుడి నడుము విరిచిందని, ఇది నరేంద్ర మోడీ దుర్మార్గపు పరిపాలనకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపు విశ్వ గురువు అని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు ప్రజల జీవితాలను నరకప్రాయం చేస్తూ మానసిక వేదనకు గురిచేయడం ఏ మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, సామాన్య ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగబడకుండా ఉండేందుకు, మతోన్మాదాన్ని, ఘర్షణలను రెచ్చగొడుతూ అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడకపోతే, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. అనంతరం తాసీల్దార్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు రాయల సిద్దు, లింగాల వీరభద్రం, కుంచపు జమలయ్య, బోడా సుందర్, పైదా వెంకటేశ్వర్లు, బానోతు హనుమంతరావు, బానోతు ఈరు, జి.కృష్ణ, కల్తీ శేఖర్, వి.దశరథ్, వి.కోటియా, మలకం సతీష్, నవీన్, జేతారాం, పి.సిద్దిక్, భిక్షమయ్య పాల్గొన్నారు.