కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 15 : ప్రధాని మోదీ బీసీల పక్షపాతి అని నిరూపించుకోవాలంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశంపై పార్లమెంట్లో చట్టం చేసి 9 వ షెడ్యూల్ లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని అందుకు అనుగుణంగా శాసన సభలో అన్ని పార్టీల మద్దతుతో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిందన్నారు.
కేంద్రంలో అధికారంలో బీజేపీ తెలంగాణ బీసీ ప్రజల ఆకాంక్షను గుర్తించి పార్లమెంట్ లో చట్టం చేసి 9వ షెడ్యూల్ లో చేర్చితే తప్ప ఇది సాధ్యం కాదన్నారు. అనేక రంగాలలో బీసీలు వెనుకబడ్డారని వారి న్యాయమైన కోరికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో బీసీలు అత్యధికంగా ఉన్నారని, దాని ప్రకారమే ప్రభుత్వం కార్యాచరణ చేసి శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించారన్నారు. బీసీల రిజర్వేషన్ పై ఈ నెల 18వ తేదీన చేపట్టిన తెలంగాణ బంద్ కు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. అనంతరం బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసిన ఆ ప్రతులను దహనం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోదుమూరి సత్యనారాయణ,
బీసీ హక్కుల సాధన సమితి జిల్లా బాధ్యులు గుత్తుల శ్రీనివాస్, తూముల శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు కురిమిల్ల శంకర్, గుత్తుల సత్యనారాయణ, వంగా వెంకట్, లక్ష్మీపతి, సురేష్, ధీటి శ్రీనివాస్, సురేష్, చల్ల భాస్కర్, జూలూరి రఘుమాచారి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు కూసపాటి శ్రీనివాస్, మోదుగు జోగా రావు, బీ ఎస్ పీ రాష్ట్ర నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖయ్యాం, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు