కొత్తగూడెం సింగరేణి, జూలై 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో శుక్రవారం నిర్వహించిన రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ కార్యక్రమంలో సీపీఐ, , కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లబ్ధిదారులకు రేషన్ కార్డు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు వేదిక పైకి రాగా ఎమ్మెల్యే కలుగజేసుకుని ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం దిగి వెళ్లండని సూచించారు. కార్యక్రమం అనంతరం మాజీ కౌన్సిలర్ వై.శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తుండగా అక్కడే ఉన్న సీపీఐ నాయకులు కలుగజేసుకుని గట్టిగా ఎందుకు మాట్లడుతున్నావు, కొంచెం మెల్లగా మాట్లాడాలని హెచ్చరించారు.
స్పందించిన కాంగ్రెస్ నాయకులు మీరెవరు చెప్పడానికి అంటుండగానే సీపీఐ నాయకులు కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోటాపోటీగా ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను వివరిస్తుంటే సీపీఐ నాయకులకేందుకు అభ్యంతరం అని కాంగ్రెస్ నాయకులు నిలదీశారు. దీంతో కొంచెంసేపు అక్కడ గందరగోళం నెలకొంది. ఈ ఘటనతో మరోసారి కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ, కాంగ్రెస్ నాయకుల మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి.
సీపీఐ పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులను ఉద్ధేశించి ‘బలుపులు బాగున్నాయి’ అని అన్నారని పార్టీ నాయకురాలు హైమవతి, రమాదేవి, విద్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ నాయకుల ఆదేశంతో కూనంనేని సాంబశివరావును గెలిపించామని, అయినప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదని వాపోయారు. ఎన్నికలకు ముందు లక్షల రూపాయలు తీసుకుని పార్టీ మారి ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలిచాక మళ్లీ సీపీఐలోకి వెళ్లిన నాయకుల పెత్తనం నియోజకవర్గంలో ఎక్కువైపోయిందని ఆరోపించారు. సీపీఐ నాయకుడు వాడిన భాష, మాట్లాడిన తీరును మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆమె తెలిపారు.