చుంచుపల్లి, ఆగస్టు 31 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే నీటి ట్యాంకులో బల్లి పడినప్పటికీ అదే నీటితో వంట చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఎప్పటిలాగే మధ్యాహ్న భోజనం వండుతున్న సమయంలో విద్యార్థి సంఘం ఏఐవైఎఫ్ నాయకులు వంటశాలను సందర్శించగా ఈ విషయం బయటపడింది. వంటకు వినియోగించే నీటి ట్యాంకులో చనిపోయి, కుళ్లిపోయిన బల్లి ఉన్నట్లు గుర్తించిన ఏఐవైఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపించిందని, వంట సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు విమర్శించారు.
అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి వినియోగించే నూనె, కూరగాయల నాణ్యతపైనా వారు అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎంఈఓ నీరజను వివరణ కోరగా.. నీటి ట్యాంకులో బల్లి పడిన విషయాన్ని వంట సిబ్బంది గమనించలేదని తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, మధ్యాహ్న భోజనం తయారీపై పర్యవేక్షణ పెంచుతామని ఆమె పేర్కొన్నారు.

బల్లి పడిన నీటితోనే వంట.. ఏఐవైఎఫ్ ఆందోళన