రామవరం, అక్టోబర్ 07 : సింగరేణి సంస్థల్లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తొలి అడుగుగా ఈఎస్ఐ (ఉద్యోగుల రాష్ట్ర భద్రతా బీమా) సౌకర్యాన్ని అందించేందుకు సింగరేణి యాజమాన్యం సర్కులర్ను సోమవారం విడుదల చేసిందని కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు గూడేల్లి యాకయ్య తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రుద్రంపూర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ సదుపాయాన్ని కల్పించాలని కృషిచేసి, దాన్ని కార్యరూపంలో విజయానికి కారణమైన టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు, స్వర్గీయ రాసూరు శంకర్ చేసిన పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కార్మికులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్ల పంపిణీ చేశారు.
ఈ సౌకర్యం కేవలం కార్మికులకే కాదు, వారి కుటుంబ సభ్యులకూ వర్తించనుంది. దీని ద్వారా కాంట్రాక్ట్ కార్మికులు మెడికల్ సౌకర్యాలు పొందగలుగుతారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై గళం విప్పిన ప్రతి సంఘానికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. లాభాల బోనస్ రూపంలో ఇచ్చిన రూ.5,500కు సహకరించిన సంఘాలకు ధన్యవాదాలు చెప్పారు. దీపావళి ముందు వేతనాల పెంపు విషయంలో శుభవార్త రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ బలరాం, సంబంధిత అధికారులకు కాంట్రాక్ట్ కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి మడిపల్లి కరుణాకర్, నాయకులు సాజిత్, అనిల్, భాష, సంజయ్, సూరి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక మహిళలు పాల్గొన్నారు.