చుంచుపల్లి, జూలై 25 : అతను అందరిలా చూస్తూ వెళ్లిపోలేదు. తనవల్ల అయిన సాయం చేసి ఎవరూ ప్రమాదం భారిన పడి విగత జీవులుగా, క్షతగాత్రులుగా మారకుండా చేశాడు. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రమాద ప్రాంతమని తెలిసేలా తనకు అందుబాటులో ఉన్న జెండా తోరణాలను సేకరించి గోతి చుట్టూ కట్టి మానవతను చాటాడు కానిస్టేబుల్ హనుమంతరావు. వివరాలు ఇలా ఉన్నాయి. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో ప్రగతి వనం వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. అందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా గోతులను తవ్వారు. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి. గోతుల్లో నీరు చేరింది. అవి గోతుల్లా కాకుండా నీటితో నిండి రోడ్డుకు సమాంతరంగా మారడంతో రాత్రి వేళల్లో తెలియని వ్యక్తులు రోడ్డు అనుకుని ఆ గోతుల్లో పడే ప్రమాదం ఏర్పడింది. ప్రమాద తీవ్రత ఎక్కువ అయితే చనిపోయే అవకాశం ఉంది.
ప్రమాద తీవ్రతను పసిగట్టిన కానిస్టేబుల్ హనుమంతరావు ఆ ప్రదేశం డేంజర్ అని తెలిపేలా వర్షంలో తడుస్తూ దగ్గరలో కిందపడి ఉన్న ఓ పార్టీకి చెందిన తోరణాన్ని స్నేహితులు మునవర్, ఈశ్వర్ సహాయంతో కర్రలతో చుట్టూ కట్టాడు. దీంతో వాహనదారులు అక్కడికి వచ్చే సరికి అప్రమత్తమై ప్రయాణించే వీలు ఏర్పడింది. గతంలో కూడా హనుమంతరావు రాత్రి డ్యూటీ ముగించుకుని రుద్రంపూర్‌లోని తన ఇంటికి వస్తున్న క్రమంలో హెడ్ ఆఫీస్ వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు కిందపడి గాయాలతో కొట్టుకుంటుంటే అందరూ చూస్తూ వెళ్లిపోయారే గానీ ఎవరూ స్పందించలేదు. అటుగా వెళ్తున్న హనుమంతరావు ఆ వ్యక్తిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి ప్రాణాలు నిలిచేలా చేశాడు.
Chunchupalle : శభాష్ కానిస్టేబుల్ హనుమంతరావు