కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 29 : మల్టి పర్పస్ రద్దు కోసం మే 19 నుండి జరిగే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె, అలాగే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న జరిగే సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు శివకృష్ణ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో పొందుపరచిన వాగ్దానాలను మరచి పాలన చేస్తున్నారని, మల్టి పర్పస్ రద్దు చేస్తామని, వేతనాలను పెంచుతామని, కార్మికులందరికీ పర్మినెంట్ చేస్తామని హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయకపోగా, కార్మికులపై మరిన్ని భారాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోపుతున్నదని విమర్శించారు. ప్రభుత్వం అనేక నిర్బంధాలను ప్రయోగించినా ధైర్యంగా కార్మికులు ఎదుర్కొన్నారని, కార్మికుల ప్రాణాలకు అత్యంత ప్రమాదకారిగా ఉన్న మల్టిపర్పస్ రద్దు చేయాలని అనేక పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 225 మంది కార్మికుల ప్రాణాలను కో్ల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మల్టి పర్పస్ విధానం రద్దుపై ఇటీవల ప్రజా భవన్ సామూహిక రాయభారం సందర్భంగా నోడల్ ఆఫీఆర్ ఇచ్చిన హామీ మేరకు త్వరలో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల మే 19 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి సిద్దమవుతామని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందని, వీటి అమలుకు రంగం సిద్ధమవుతున్నందున మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేసి కార్మిక శక్తి చూపించి, ప్రభుత్వ చర్యలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా, గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు సదానందం, వెంకన్న, దారయ్య, నాగరాజు, మాధవి, వీరమ్మ పాల్గొన్నారు.