రామవరం, జులై 02 : ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించన 11.27 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 12.23 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 109 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు తెలిపారు. బుధవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడంలో సహకరించిన కార్మికులకు, అధికారులకు, యూనియన్ నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు 37.40 లక్షల టన్నులకు గాను 38.29 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 102% శాతం ఉత్పత్తి లక్ష్యం సాధించినట్లు తెలిపారు.
కొత్తగూడెం ఏరియా ఇప్పటి వరకు 668 మంది వారసులకు కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. అలాగే 72 మందికి ఉద్యోగం బదులు ఏక మొత్తం నగదు చెల్లించినట్లు వెల్లడించారు. ఒకరికి నెలవారి భృతి మంజూరు చేసినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో 10 లక్షల వరకు ఇంటి రుణంపై వడ్డీని కొత్తగూడెం ఏరియా 315 దరఖాస్తులకు గాను 60 మందికి ఇంటి రుణంపై వడ్డీని ఇవ్వడం జరిగిందన్నారు. మిగిలిన 255 మందికి సరైన పత్రాలు సమర్పిస్తే మంజూరు పత్రాలు అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్. ఓ. టు జిఎం జి.వి. కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ఏజీఎం (సివిల్) సీహెచ్.రామకృష్ణ, ఏజిఎం (ఫైనాన్స్) కె.హాన సుమలత, డీజీఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, డీజీఎం (ఐ.ఈ) ఎన్. యోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ జీకేఓసీ ఎం.రమేశ్, డీజీఎం (ఈ&ఎం) టి. శ్రీకాంత్, డివై పిఎం హరీశ్ గోవర్ధన్, సింగరేణి సేవ సమితి కో-ఆర్డినేటర్ సాగర్, పర్సనల్ డిపార్ట్మెంట్ సిబ్బంధి పాల్గొన్నారు.