– కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
పాల్వంచ, డిసెంబర్ 27 : ప్రకృతి సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టడం దుర్మార్గంమైన చర్యని, కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రజల కోసమా అదానీ, అంబానీలాంటి కుబేరుల కోసమా తేల్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం పాల్వంచలోని చండ్ర రాజేశ్వరరావు భవన్లో సీపీఐ జిల్లా సమితి సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆపరేషన్ల పేరుతో సాగిస్తున్న నిర్బంధాలపై ప్రజా తిరుగుబాటు ఉద్యమాలు తప్పవన్నారు. మతాలు, కులాల పేరుతో కాషాయం పార్టీ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రజల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతోందన్నారు.
కమ్యూనిస్టులు లేకుండా చేయాలనే కుట్రతో కేంద్రంలోని పాలకులు యోచిస్తున్నారని, అందుకే మావోయిస్టులను సైతం డెడ్లైన్ పెట్టి మరీ చంపుతున్నారని మండిపడ్డారు. అడవుల్లో నిక్షిప్తమైన అపార ఖనిజ సంపదను కాజేసేందుకు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ మావోయిస్టు నేతలను హతమార్చడం సరైంది కాదన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని చెబుతున్నప్పటికీ ఈ మారణ హోమానికి తెగబడటం పైచాచికమని, మావోయిస్టుల హత్యలపై న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా కార్యవర్గ సభ్యుడు చండ్ర నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం కల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు మిరియాలు రంగయ్య, సర్ రెడ్డి పుల్లారెడ్డి, నరాటి ప్రసాద్, వై.ఉదయ భాస్కర్, మున్నా లక్ష్మీ కుమారి, కె.సారయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, చంద్రగిరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి మురళి, రేసు ఎల్లయ్య, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, జి.వీరాస్వామి, భూక్య దాసురు, బంధం నాగయ్య, ఉప్పుశెట్టి రాహుల్, ఎస్కే.ఫహీం, మండల, పట్టణ కార్యదర్శులు, ప్రజా సంఘాల జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.