రామవరం, ఆగస్టు 05 : అధికారుల నిర్లక్షం దొంగలకు వరంగా మారింది. బాధితులు మాత్రం లబోదిబోమని ఏడ్చే పరిస్థితి దాపురించింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రాంతాల్లో పరిస్థితి. అప్పటి సీఐ బత్తుల సత్యనారాయణ ప్రజల భాగస్వామ్యంతో సుమారు రూ.12 లక్షల వ్యయంతో టూటౌన్ పరిధిలోని రామవరం, 3 ఇంక్లైన్, 4 ఇంక్లైన్, ధన్బాద్, రుద్రంపూర్, గౌతమ్ పూర్, పెనగడప, రాంపురం పంచాయతీలో 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ అవి క్రమంగా పని చేయకుండాపోయి కేవలం అలంకారప్రాయంగా మాత్రమే మిగిలిపోయాయి.
ఈ ప్రాంతాల్లో ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే నిందితులను తొందరగా గుర్తించి కేసును ఛేదించవచ్చనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అధికారుల నిర్లక్షంతో పని చేయకుండా పోయాయి. సోమవారం రుద్రంపూర్లో పట్టపగలే ఓ ఇంట్లో భారీ చోరీ జరిగినా నిందితుడి ఆచూకీ లభించలేదు. అదే సీసీ కెమెరాలు పని చేసి ఉంటే నిందితుడి గుర్తించడంలోనూ. అలాగే దొంగతనం చేసేందుకు భయపడేవారని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడ్డారు. గతంలోనూ ఈ ప్రాంతంలో దొంగతనాలు జరిగినా అధికారుల్లో స్పందన కరువైందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీ కెమెరాలను పునరుద్ధరిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.