జూలూరుపాడు, జూలై 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కారు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని సఫాయిస్తీ బస్తి ప్రాంతానికి చెందిన షేక్ హంజాద్ (21) యువకుడు వ్యక్తిగత పనులపై తన ద్విచక్ర వాహనంపై ఖమ్మం వెళ్లి ఇంటికి తిరిగి వెళుతుండగా జూలూరుపాడు మండలం పరిధిలోని దండుమిట్టతండా గ్రామ సమీపంలోకి రాగానే కొత్తగూడెం నుంచి తల్లాడవైపు వెళుతున్న కారు అతివేగంతో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు వాహనంపై నుండి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తీవ్ర గాయాలైన హంజాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జూలూరుపాడు ఎస్ఐ ఎన్.జీనత్ కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

దండుమిట్టతండాలో బైక్ను ఢీకొట్టిన కారు.. యువకుడు దుర్మరణం