చుంచుపల్లి, డిసెంబర్ 06 : ఎన్నికల నియమావళికి లోబడి అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్ తెలిపారు. శనివారం చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ బైపాస్ సెంటర్ నందు చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పిస్తూ పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డీఎస్పీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల నియమవళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రచారానికి అవసరమైన పోలీస్, తాసీల్దార్ అనుమతులు తీసుకుని ప్రచారం చేసుకోవాలన్నారు.
ఎన్నికల సమయంలో చట్ట వ్యతిరేకమైన పనులు గాని, ఎటువంటి గొడవల్లో ఉంటే పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం జీవితాంతం కోర్టులు చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. జీవితాంతం ప్రతి ఎన్నికలో బైండోవర్ కావాల్సి వస్తుందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టినా, బెదిరించినా, నజరానాలు ఇస్తూ పట్టుపడితే జైలు తప్పదన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ సిబ్బందికి పోటీ చేసే అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల సిఐలు, ఎస్ఐలు, స్థానిక ఎస్ఐ రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.