– ఏడాది కావస్తున్నా పూర్తికాని ఆస్పత్రి నూతన భవన నిర్మాణం
– వార్డుల్లో భయం భయంగా రోగులు, వైద్య సిబ్బంది
బూర్గంపహాడ్, జూలై 18 : బూర్గంపహాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) శిథిల భవనంలోనే కొనసాగుతోంది. ఓ పక్క శిథిలమైన భవనం.. మరోపక్క అసౌకర్యాల నడుమ అరకొర వైద్యులు, సిబ్బందితో రోగులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దున ఉన్న ఈ ఆస్పత్రి వైద్య విధాన పరిషత్ పర్యవేక్షణలోనే కొనసాగుతున్నా ఇక్కడ సౌకర్యాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. ఈ ఆస్పత్రికి నిత్యం 100 నుంచి 150 వరకు ఓపీ ఉంటుంది. ఇన్ పేషెంట్ సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన భవనంలో ఆస్పత్రి కొనసాగుతున్నా అసౌకర్యాలు మాత్రం రాజ్యమేలుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కనీసం కూర్చునేందుకు సరైన గదులు లేవు. ఉన్న సౌకర్యాలతోనే ఆసుపత్రి నిర్వహణ సాగుతోంది.
శస్త్ర చికిత్సలు జరుగుతున్నా అక్కడక్కడా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఆస్పత్రి భవనం శిథిలమైన నేపథ్యంలో కొత్తగా 30 పడకల ఆస్పత్రి కోసం నూతనంగా భవనం నిర్మిస్తున్నప్పటికీ ఏడాది గడుస్తున్నా ఆ భవన నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పటికే రోగులు పాత ఆస్పత్రి భవనంలోని వార్డుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని, వర్షాకాలం కావడంతో అకస్మాత్తుగా భవనం కూలితే తమ పరిస్థితి ఏమిటని రోగులు భయాందోళనలు చెందుతూ బిక్కుబిక్కుమంటూ వార్డులో చికిత్స పొందుతున్నారు. నూతన ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి కావడానికి నాలుగైదు నెలలైనా సమయం పట్టే అవకాశం ఉండడంతో అప్పటివరకు రోగులకు పాత భవనంలో ఇబ్బందులు తప్పేలా లేవు.
ఆస్పత్రి వెనుక ఉన్న మార్చురీ (శవ పరీక్ష గది) సైతం శిథిలావస్థకు చేరడంతో గత ఏడాదికాలంగా మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించడం లేదు. ఈ మండలంలో ఎవరు మృతి చెందినా వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించాల్సిందే. ఈ ఆస్పత్రిలో ఏడుగురు వైద్యులు ఉండగా అందరూ కూడా డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నవారే కావడం శోచనీయం. మరోపక్క ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్లది కూడా ఇదే వరుస. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాత భవనంలో ఆస్పత్రికి సరైన సౌకర్యాలు కల్పించి రెగ్యులర్ వైద్యులు, సిబ్బందిని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.