– జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో
జూలూరుపాడు, సెప్టెంబర్ 07 : అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జూలూరుపాడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం రాస్తారోకో నిరసన ర్యాలీ చేపట్టారు. వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒంటెద్దు పోకడలకు, పోలీసుల ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఈ తరహా డ్రామాలకు తెరలేపిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను, నాయకులను అసెంబ్లీకి రానీయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో బీఆర్ఎస్ పోరాటాన్ని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు చాపలమడుగు రామ్మూర్తి, బాదావత్ నరేష్, నిమ్మటూరి కనకయ్య, పురస్తపురవు రామకృష్ణ, ఇల్లంగి తిరుపతి, పోతిన్ని బాబు, పోతురాజు రామారావు పాల్గొన్నారు. యువజన నాయకులు రామిశెట్టి వంశీ, పోతిన్ని రాంబాబు, జాటోత్ నరేష్, హలావత్ సూర్య భాయ్, గరిక ప్రభాకర్, హలావత్ గణేష్, లకావత్ గణేష్, భూక్యా రాందాస్, బానోత్ రవి, మాచర్ల వీరన్నతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.