రామవరం, జులై 09 : రుద్రంపూర్లో గల సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి సేవలు అభినందనీయమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం, బీఏఎస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట శివశంకర్ అన్నారు. బుధవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో బ్రదర్ రాజశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది సంవత్సరాల నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ ద్వారా బ్రదర్ రాజశేఖర్ రెడ్డి నిరుపేద ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం నుంచి గత మూడు సంవత్సరాలుగా స్కూల్ యాజమాన్యానికి రూ.70 లక్షలు రావాల్సి ఉండగా, రాకపోయినా ఎస్సీ విద్యార్థులను ఎక్కడా లోటు లేకుండా పుస్తకాలతో పాటు బట్టలు అందించి విద్యనందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ బీఏఎస్ విద్యార్థులు 10 మందిలో ఐదుగురు 530 పైబడి మార్కులు, మిగతా ఐదుగురు విద్యార్థులు 440 మార్కులు పైబడి సాధించేలా కృషి చేసిన యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ సభ్యులు కందుల గురుమూర్తి, కత్తి భాస్కర్, తిట్ల శంకర్, తీట్ల లీలా, సరోజ సంతోశ్, లక్ష్మీ, నమిల్ల రాము, దుర్గాభవాని, భాగ్య పాల్గొన్నారు.