– ఇరువురిపై కేసు నమోదు
– బూర్గంపాడు మండలంలో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంలో ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. తల్లి బంగారం పంపకం విషయంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. అన్న నాగిరెడ్డి, వదిన పద్మపై తమ్ముడు రామకృష్ణారెడ్డి రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుండగా తమ్ముడు రామకృష్ణారెడ్డి నాపరాయితో వదిన తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. తర్వాత అన్నయ్యపై కూడా దాడి చేయడంతో ఆయన కింద పడిపోయాడు. స్థానికులు వారిని వారించి గాయాల పాలైన వారిని చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న బూర్గంపాడు పోలీసులు దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.