రామవరం, సెప్టెంబర్ 15 : వారి ఆర్థిక పరిస్థితులు దళారులకు ధనాన్ని తెచ్చిపెడుతుంది. సింగరేణి యాజమాన్యం లక్ష్యం నీరుగారి పోతుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్ ఆర్ టి ఏరియా, ధన్బాద్ పంచాయతీ పరిధిలోని మాయాబజార్, వనమా నగర్ పంచాయతీ పరిధిలో ఉన్న వారిని సింగరేణి యాజమాన్యం ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడంతో అక్కడి ప్రజలు తమకు ప్రత్యామ్నాయం చూపాలని ఆందోళన చేసిన వారు కొందరైతే, మరికొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పటి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సమస్యను పరిష్కరించాల్సిందిగా సింగరేణి సంస్థ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ బలరాంకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 3 అక్టోబర్, 2023న వనమా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా కొత్తగూడెం ఏరియాలోని మాయాబజార్, వనమా నగర్, ఎస్.ఆర్.టి క్వార్టర్స్ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెంలోని రైల్వే భూ నిర్వాసితులకు ఇంటి స్థలం పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ లోని సర్వే నంబర్ 143 లోని భూమిని 347 మందికి ఒక్కొక్కరికి 100 చదరపు గజాల చొప్పున ఇంటి స్థలాల పట్టాల పంపిణీ చేశారు. కానీ గత కొన్ని రోజులుగా కొందరు బ్రోకర్ల సాయంతో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన 100 గజాల స్థలాలను బేర సారాలు నిర్వహిస్తున్నారు. ఈ స్థలాలు కొత్తగూడెం పట్టణంలో ఉండడం ఇప్పటికే ఆ ప్రాంతంలో రోడ్లు, విద్యుత్ సదుపాయం, మంచినీటి వసతిని సింగరేణి యాజమాన్యం సమకూర్చింది. దీంతో ఈ స్థలాలకు డిమాండ్ పెరగడంతో ఇందులో కొందరి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆశ చూపెట్టి అమ్ముకునేలా చేస్తున్నారు. మూడు ఫ్లాట్లు, అందినంత కమీషన్లు అన్న చందన నడుస్తున్నది వ్యవహారం. ఈ విషయమై ఇప్పటికే సింగరేణి యాజమాన్యం ఎవరెవరు ఇంటి స్థలాలు అమ్ముకున్నారు. ఇంటి స్థలం తీసుకుని సింగరేణి క్వార్టర్లలో ఉంటున్న వారు ఎవరు? తదితర అంశాలను సర్వే చేయిస్తుంది. ఇంటి స్థలం వచ్చినప్పటికీ ఇంటిని నిర్మించుకోకుండా సింగరేణి క్వార్టర్లలో అక్రమంగా ఉంటున్న వారి వివరాలను సేకరించి క్వార్టర్లను ఖాళీ చేయించే పనిలో నిమగ్నమై ఉంది సింగరేణి యాజమాన్యం.
Ramavaram : దళారుల దళాలిలో నిర్వాసిత ప్రజలు