– తాగునీటికి తండ్లాట
– పనిచేయని వాటర్ ట్యాంక్, సరఫరా కాని మిషన్ భగీరథ నీళ్లు
– వెలగని వీధి లైట్లు
జూలూరుపాడు, అక్టోబర్ 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని బోజ్యా తండాలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఒకటి రెండు కాదు గ్రామంలో సమస్యలు తీష్ట వేసి తండావాసులను వేధిస్తున్నాయి. పారిశుధ్యం పడకేయడంతో పాటు తాగునీరు అందక, వీధి లైట్లు వెలగక గిరిజన తండాలోని ప్రజలు నానా అవస్తులు పడుతున్నారు. గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంక్ కి నీటిని సరఫరా చేసే విద్యుత్ మోటార్ మరమ్మతులకు గురికావడంతో వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా మారింది. మిషన్ భగీరథ పథకంలో నీటిని కొన్ని రోజులపాటు సరఫరా చేసిన అధికారులు, ఇటీవల పైప్లైన్లు మరమ్మతులకు గురికావడంతో నీటిని సరఫరా చేయకుండా నిలిపివేశారు. దీంతో గిరిజనులు సమీప ప్రాంతాల్లోని బావులు, పొలాల వద్ద ఉన్న విద్యుత్ మోటార్ల వద్దకు వెళ్లి నీటిని తీసుకుని వచ్చి వాడుకోవాల్సిన పరిస్థితులకు దాపురించాయి.
గ్రామస్తులు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని. గ్రామ పంచాయతీలో నిధులు లేవని ప్రస్తుతం ఏమి చేయలేమంటూ సమాధానం ఇస్తుండడంతో ఉసురుమంటూ వెనుతిరిగి వెళ్తున్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు సైతం పడకేశాయని, డ్రైనేజీల్లో మురికినీరు నిల్వ ఉన్నా శుభ్రం చేయడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వీధి లైట్లు వెలగకపోవడంతో వీధుల్లో కుక్కలు సంచరిస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయని, చీకట్లో రాకపోకలు సాగించాలంటే భయం గుప్పెట్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాత్రి వేళల్లో తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి గ్రామంలో తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించి గిరిజన తండా వాసుల కష్టాలను తొలగించాలని బొజ్జా తండా వాసులు కోరుతున్నారు.
Julurupadu : సమస్యల నిలయంగా బోజ్యా తండా
Julurupadu : సమస్యల నిలయంగా బోజ్యా తండా