రామవరం, డిసెంబర్ 26 : విబి జి రామ్ జి చట్టాన్ని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని వ్యవసాయ కార్మిక, రైతు, కార్మిక సంఘాలు, ఎస్కేఎం నాయకులు రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించారు. వ్యవసాయ కార్మిక, రైతు, కార్మిక, ఎస్కేఎం ఆధ్వర్యంలో నల్ల జెండాలతో మంచికంటి భవన్ నుండి తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అన్నవరపు సత్యనారాయణ, జాటోత్ కృష్ణ, కొలగాని బ్రహ్మచారి, కందగట్ల సురేందర్, కోరం గణేశ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు.
కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి కార్మికుల హక్కులను హరించి, పని గంటలు పెంచి కార్పోరేట్ సంస్థలకు కార్మికులను బానిసలుగా మార్చిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తేవడంలో ఉన్న ఆరాటం, కనీస మద్దతు ధరల చట్టం చేయడంలో లేదన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ గార్ అజివిక మిషన్ గ్రామీణ చట్టాన్ని ఏకపక్షంగా తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ పేదలకు 200 రోజులు పని కల్పించి దేశ బడ్జెట్లో లక్షన్నర కోట్ల రూపాయల నిధులు కేటాయించాల్సిన బాధ్యత నుండి తప్పించుకోవడం కోసం ఈ చట్టం చేశారని దుయ్యబట్టారు. 90 శాతం నిధులు కేటాయించాల్సిన బాధ్యత నుండి తప్పించుకుని పేదలను బాగు చేయడం కోసమే చట్టం మార్పు చేశామని దొంగ మాటలు చెబుతున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపడం కోసమే మార్పులు చేశారన్నారు. గాంధీ పేరు మార్చడం కోసం కుట్ర జరుగుతోందన్నారు. కార్పోరేట్ల సంపద పెంచడం కోసం పన్ను రాయితీలు ఇస్తూ పేదల పథకానికి నిధులు కోత విధించడంతో మోదీ ప్రభుత్వ నైజం బయట పడిందన్నారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మందా నర్సింహారావు, యలమంచిలి వంశీకృష్ణ, భూక్యా రమేశ్, కోరం గణేశ్, యాసా నరేశ్, శెట్టి వినోద, రమేశ్ బాబు, నాగరత్నమ్మ, కోట బాలకృష్ణ, సిద్దెల రాములు, సోల్తి రఘు పాల్గొన్నారు.