జూలూరుపాడు, ఏప్రిల్ 24 : ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలన్నీ సత్వరమే పరిష్కారం అవుతాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో తెలంగాణ భూ భారతి, భూమి హక్కుల చట్టం 2025పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల అందరి భూములకు భూధార్ నంబర్ కేటాయించి, హద్దులతో కూడిన చిత్రపటాన్ని పట్టాదారు పాస్ పుస్తకంలో పొందపరచునున్నట్లు తెలిపారు. ఇంటి స్థలాలను కూడా రికార్డుల్లో నమోదు చేయనున్నట్లు తెలిపారు.
నూతన చట్టంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనేతర రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదని, ఈ చట్టంతో మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. జూన్, జూలై నెలల్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాదాబైనామా, వారసత్వంగా వచ్చే భూములను సమగ్రంగా గ్రామాల్లో విచారణ చేపట్టి హక్కులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఆర్డీఓ మధు, తాసీల్దార్ స్వాతి బిందు, ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి, ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు, నాయకులు లేళ్ల వెంకట్రెడ్డి, విజయబాయి, మంగీలాల్ పాల్గొన్నారు.