– డిపో మేనేజర్ ఒంటెద్దు పోకడలు?
– రీజియన్ పరిధిలో ఎక్కడా లేనివిధంగా అధిక పని భారం
– తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడిలో కార్మికులు
భద్రాచలం, సెప్టెంబర్ 09 : అంతర్రాష్ట్ర కూడలి భద్రాచలం ఆర్టీసీ డిపోలో శ్రమ దోపిడీ జరుగుతుందంటూ టిమ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. డిపో మేనేజర్ ఒంటెద్దు పోకడలతో తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఎంయూ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నుండి ఆందోళన బాట పట్టిన సుమారు 60 మంది కార్మికులు తమ పోరాటాన్ని మంగళవారం కూడా కొనసాగిస్తున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు విధులను బహిష్కరిస్తామంటూ టిమ్ డ్రైవర్లు తెగేసి చెబుతున్నారు. దీంతో యాజమాన్యం చేసేది లేక సోమవారం రాత్రి నుంచి పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో కార్మికులు డిపో ఆవరణలోనే మంగళవారం ఉదయం అల్పాహారం తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, నిద్ర సైతం ఇక్కడే అంటూ డ్రైవర్లు పేర్కొన్నారు.
భద్రాచలం డిపో మేనేజర్‌గా తిరుపతి విధుల్లో చేరిన నాటి నుండి నూతన పోకడలకు శ్రీకారం చుడుతూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని టీమ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. రీజియన్‌లోని ఏడు డిపోల పరిధిలో ఎక్కడా లేనిది భద్రాచలం డిపోలో పనిచేసే టీమ్ డ్రైవర్లపై అధిక పని భారం మోపుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని కార్మికులు మండిపడుతున్నారు. ఒక్కొక్క టీమ్ డ్రైవర్ వారానికి 1,890 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని, భద్రాచలం నుండి హైదరాబాద్ సర్వీస్ నడిపే క్రమంలో టీమ్ డ్రైవర్లు నరకయాతన పడుతున్నారని, వాటర్ బాటిల్స్ సప్లై చేసే దగ్గర నుండి రిజర్వేషన్ చెక్ చేసుకోవడం, కార్గో పార్సిల్ సప్లై, పాసింజర్లకు టికెట్లు సరఫరా చేయడం వంటి పనులు ఉంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కేవలం 7 గంటల్లోనే హైదరాబాద్ చేరుకోవాలంటూ నిబంధనలు పెడుతున్నారని, మిగులు ఆయిల్ ఉండాలంటూ వేధిస్తున్నారని, తద్వారా డ్రైవర్లు పని ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు.
గత కొన్ని రోజుల క్రితం సుమారు 8 మంది డ్రైవర్లు విధి నిర్వహణలోనే సిక్ అయ్యారని, ఇద్దరు, ముగ్గురు డ్రైవర్లు మార్గమధ్యలోనే ఆస్పత్రి పాలైనట్లు వెల్లడించారు. ప్రజలను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన తాము అధిక ఒత్తిడితో విధులు నిర్వహిస్తూ ఒక్కొక్కసారి ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చలేమోననే ఆందోళన తీవ్ర మవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము విధులు బహిష్కరించడంతో డిపో మేనేజర్ అర్హత లేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో హైదరాబాద్ సర్వీసులు నడిపిస్తున్నారని, నిబంధనల ప్రకారం ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు తప్పా డీలక్స్, సూపర్ డీలక్స్, ఆపై సర్వీసులు నడుపరాదన్నారు. ఈ నేపథ్యంలో వారిని హైదరాబాద్ సర్వీసులకు పంపిస్తే ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ ఉండదని, డిపో మేనేజర్ ఆర్థిక లాభాలకు కక్కుర్తి పడుతూ తనకు మంచి పేరు రావాలనే దురుద్దేశంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కార్మికులు మండిపడ్డారు.
భద్రాచలం డిపో అధికారి అండతో సూపర్వైజర్లు (ఏడీసీలు) ఆర్టీసీ కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యం బాగా లేకున్నా, కుటుంబ సభ్యులకు, బంధువులకు బాగా లేకున్నా సెలవు కావాలంటే సూపర్వైజర్ల ముందు పడిగాపులు కాయాల్సిందే. వాళ్లకు అనుకూలంగా ఉన్న వారికి సెలవులు ఇస్తూ, మిగిలిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ఆర్టీసీ కార్మికులు వాపోయారు. ఇటీవల ఒక డ్రైవర్ తనకు ఆరోగ్యం బాగా లేదు. ఆస్పత్రికి వెళ్లేందుకు సెలవు కావాలంటే డ్యూటీకి వెళ్లాల్సిందే అని బలవంతంగా డ్యూటీకి పంపించారు. అలాంటి సమయంలో తనకు ఏమైనా అయితే కుటుంబ పరిస్థితి ఏంటని సదరు డ్రైవర్ వాపోయాడు.
పని భారంతో డ్రైవర్లు మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యాల పాలవుతున్నారని, ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికైనా టీం డ్రైవర్ల పై దయ చూపాలని ఆందోళన బాట పట్టిన కార్మికులు కోరారు. లాంగ్ సర్వీసులకు కండక్టర్ ని ఇవ్వాలని, కిలోమీటర్లు తగ్గించాలని, మిగతా డిపోల మాదిరిగానే భద్రాచలం డిపోలో విధులు మాస్టర్లు సరి చేయాలని, కార్మికుల ఆరోగ్యాల పట్ల యాజమాన్యం శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Bhadrachalam : భద్రాచలం ఆర్టీసీ కార్మికుల ఆందోళన బాట