రామవరం, మే 12 : క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ తప్పక శారీర శ్రమకు సమయం కేటాయించి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆ సూక్తిని ఎప్పుడు మరవద్దని సింగరేణి డైరెక్టర్ ఈ అండ్ ఎం డి సత్యనారాయణ రావు అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో నిర్వహించిన క్రికెట్ ఆఫ్ సింగరేణి ఎగ్జిక్యూటివ్ టోర్నమెంట్ 2024 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్రికెట్ గేమ్ ఒక టీం వర్క్ గేమ్ అని, ఒక్కరు రాణిస్తే గేమ్ గెలువలేరని టీం సభ్యులందరూ కలిసికట్టుగా రాణిస్తేనే వారి టీం గెలుపొందుతుందన్నారు. ఇలాగే మన సింగరేణి సంస్థలో కూడా ప్రతి ఒక్కరం ఎవరికి కేటాయించిన విధులను వారు నమ్మకంగా నిర్వర్తించి రక్షణతో సమిష్టిగా సంస్థ పురోభివృద్దికి తోడ్పడాలన్నారు.
ముగింపు రోజు నిర్వహించిన క్రికెట్ పోటీలో ఇంటర్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్ (క్రికెట్ ఆఫ్ సింగరేణి ఎగ్జిక్యూటివ్ టోర్నమెంట్) ఫైనల్ మ్యాచ్ కొత్తగూడెం రీజియన్ టీంతో బెల్లంపల్లి రీజియన్ టీం తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కొత్తగూడెం రీజియన్ టీం 20 ఓవర్లకు 09 వికెట్లు కోల్పోయి 129 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాక బెల్లంపల్లి రీజియన్ టీమ్ 05 వికెట్లు కోల్పోయి 130 పరుగులు సాధించి విజయం సాధించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డైరెక్టర్ (ఈ & ఎం) డి సత్యనారాయణ రావు పాల్గొని విన్నర్స్ , రన్నర్స్ టీం లకు బహుమతులను అందజేశారు. అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ టీంల పోటీలో బెల్లంపల్లి రీజియన్ టీం గెలుపొందింది. రన్నరప్ టీం గా కొత్తగూడెం రీజియన్ టీం నిలిచింది. అలాగే మహిళా ఎగ్జిక్యూటివ్ టీంలలో కొత్తగూడెం ఏరియా మహిళా ఎగ్జిక్యూటివ్ విజేతగా నిలవగా, బెల్లంపల్లి మహిళా ఎగ్జిక్యూటివ్ టీం రన్నరప్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తో పాటు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు, జిఎం (సిపిపి) మనోహర్, కొత్తగూడెం ఏరియా ఎస్. ఓ. టు జిఎం జీవి కోటిరెడ్డి, కమిటీ మెంబర్ పాలడుగు శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
Ramavaram : క్రికెట్ ఆఫ్ సింగరేణి ఎగ్జిక్యూటివ్ టోర్నమెంట్ విజేత బెల్లంపల్లి రీజియన్ టీం