రామవరం, అక్టోబర్ 18 : దశాబ్దాలుగా బీసీ వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని, బీసీ జనాభా ఎక్కువ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 5 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండడం చాలా అన్యాయం అని కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి సకినాల సమ్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని సింగరేణి కాలరీస్ బీసీ & ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకత్వం పిలుపు మేరకు శనివారం ఉదయం కొత్తగూడెం ఏరియాలో అన్ని మైన్స్, డిపార్ట్మెంట్స్ వద్ద అధికారులకు నాయకులు మెమొరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. బీసీలకు విద్యా, ఉద్యోగ నియామకాల్లో సైతం అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో బీసీ, ఓబీసీ ఉద్యోగులకు కూడా ROR పద్ధతిలో అన్యాయం జరుగుతుందని తెలిపారు. కాబట్టి తెలగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు ఉద్యమిస్తామని పేర్కొన్నారు. అనంతరం పీవీకే గని మేనేజర్ శ్యాం ప్రసాద్ కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో కె.వీరభద్రయ్య, బోరింగ్ శంకర్, వల్లాల సాంబమూర్తి, శంకర్, ఎస్.సంపత్, ఈ.శ్రీనివాస్, వై.శంకర్, మహేశ్, ప్రభాకర్, ధర్మ, రాజేశ్, రాజ, బీసీ, ఓబీసీ సభ్యులు పాల్గొన్నారు.